IYR Krishna Rao: ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ సమావేశం పెట్టడమే అసంబద్ధం: ఐవైఆర్ కృష్ణారావు

  • సీఎం ముఖ్యకార్యదర్శి నిర్వహించే భేటీకి రావాలంటూ ఎస్ఈసీకి లేఖ
  • మండిపడ్డ ఎన్నికల కమిషన్ వర్గాలు
  • సుమతీ శతకంలోని పద్యాన్ని గుర్తు చేసిన ఐవైఆర్
  • ఇది చీఫ్ సెక్రటరీ పెట్టాల్సిన సమావేశమని వ్యాఖ్య
iyr krishna rao slams ap govt

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు గాను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ ఈ నెల 28వ తేదీన రాజకీయ పార్టీలతో ఓ సమావేశం నిర్వహించాలని అనుకున్నారు. దీంతో ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ వ్యక్తిగత కార్యదర్శి నుంచి రమేశ్ ఆఫీసుకి నిన్న ఓ లేఖ అందింది. ప్రవీణ్ ప్రకాశ్ ఈ నెల 26న ఓ సమావేశం నిర్వహిస్తున్నారని, దానికి రమేశ్ కుమార్ హాజరు కావాలని అందులో ఉంది.

దీనిపై ఎన్నికల కమిషన్ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హైకోర్టు జడ్జితో సమాన హోదా గల పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్ కు ఇలా ఓ సమావేశానికి రావాలని హుకుం జారీ చేయడం తీవ్ర అభ్యంతరకరంగా ఉందని, ఇది పూర్తి అసంబద్ధమని చెప్పారు. ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి నిర్వహించే సమావేశానికి రావాలని లేఖ రాయడమేంటని ప్రవీణ్ ప్రకాశ్ కార్యాలయంపై రమేశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. ఈ విషయాలన్నింటినీ ఈనాడు దినపత్రికలో వెల్లడించారు. వీటిపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుమతీ శతకంలోని ఓ పద్యాన్ని గుర్తు చేశారు.

‘కూరిమి గల దినములలో నేరము లెన్నడును కలుగ నేరవు. మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచు చుండు నిక్కము సుమతీ. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ సమావేశం పెట్టడమే అసంబద్ధం. పంచాయతీరాజ్ సెక్రెటరీ గాని, చీఫ్ సెక్రటరీ గాని పెట్టాల్సిన సమావేశం ఇది’ అని ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు.


More Telugu News