మాటలు రావడం లేదన్న రాహుల్.. బాధగా ఉందన్న వార్నర్

25-10-2020 Sun 11:38
  • విజయాలను అలవాటుగా చేసుకున్నాం
  • బౌలర్లు బ్రహ్మాండంగా బంతులేశారు
  • ఓటమిని మర్చిపోయి ముందుకు సాగుతాం
david warner and kl rahul after dubai match

ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో అనూహ్యంగా విజయం సాధించడంపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ సంతోషం వ్యక్తం చేశాడు. గత రాత్రి దుబాయ్‌లో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు అనూహ్య విజయం సాధించింది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. విజయాలను ఇప్పుడు అలవాటుగా చేసుకున్నట్టు చెప్పాడు. ఆటగాళ్ల ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నట్టు పేర్కొన్నాడు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మాటలు రావడం లేదని అన్నాడు. తమ బౌలర్లు మంచి బంతులేశారని, ఫలితంగా విజయం సాధించామని చెప్పుకొచ్చాడు. జట్టులో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు ఉండడంతో పరుగులు ఎక్కువగా ఇచ్చుకోకపోతే మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చని ముందే అనుకున్నానని రాహుల్ పేర్కొన్నాడు.

మరోవైపు, విజయం దరికి దాదాపు చేరుకుని అనూహ్యంగా 12 పరుగుల తేడాతో ఓటమి చవిచూడడంపై సన్‌రైజర్స్  హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ విచారం వ్యక్తం చేశాడు. ఓటమి తనను బాధకు గురిచేసిందన్నాడు. పంజాబ్‌ను తొలుత తమ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారని ప్రశంసించాడు. లక్ష్యఛేదనలో తొలుత బాగానే ఆడినా తర్వాత లయ తప్పిందన్నాడు. అలాగే, పంజాబ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని ప్రశంసించాడు.

ఈ ఓటమిని మర్చిపోయి ముందుకు సాగుతామని వార్నర్ పేర్కొన్నాడు. కాగా, 11 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ నాలుగింటిలో గెలిచి 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. నిన్నటి మ్యాచ్‌లో గెలిచి ఉంటే ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండేవి. ఇక, వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ గెలిచిన పంజాబ్ 10 పాయింట్లతో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.