మామ గైర్హాజరీలో తొలిసారిగా బిగ్ బాస్ ను హోస్ట్ చేయనున్న కోడలు సమంత!

25-10-2020 Sun 06:39
  • నేటి నుంచి షోకు నూతన హోస్ట్
  • ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న నాగార్జున
  • నేడు బుల్లితెర పైకి సమంత
Samantha is Host of Biggboss

టాలీవుడ్ అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్, ఈ రోజు నూతన హోస్ట్ కు స్వాగతం పలకనుంది. అది మరెవరో కాదు. అక్కినేని ఇంటి కోడలు సమంత. ప్రస్తుతం బిగ్ బాస్ ను తన మాటల మాయాజాలంతో నడిపిస్తున్న నాగార్జున, ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం వెళ్లాల్సి వచ్చింది. దీంతో తిరిగి నాగార్జున అందుబాటులోకి వచ్చేంత వరకూ షోను నడిపించే బాధ్యతలను తన కోడలు సమంతకు నాగ్ అప్పగించేశారు.

వాస్తవానికి నిన్ననే సమంత బుల్లితెరపైకి వస్తారని భావించినా, ఆమెను కేవలం ప్రోమోకు మాత్రమే బిగ్ బాస్ పరిమితం చేశాడు. ఆదివారం నాడు ఆమె టీవీ స్క్రీన్ పై కనిపిస్తుందని చెబుతూ, ప్రతి ఒక్కరిపై సమంత అభిప్రాయాలను చూపించాడు. ఇక, నేడు దసరా పండగ కావడంతో, ఈ వారం ఎలిమినేషన్ కూడా ఏమీ ఉండక పోవచ్చని షో షూటింగ్ ను చూసిన లీక్ వీరులు సోషల్ మీడియాలో చెబుతున్నారు.

ఇక నాగార్జున టీవీ స్క్రీన్ పై మాత్రమే కనిపించి, సమంతకు బాధ్యతలు అప్పగించి, బ్రేక్ తీసుకుంటారా? లేక సమంతతో పాటు కాసేపైనా బిగ్ బాస్ స్క్రీన్ పై కనిపిస్తారా? అన్న విషయమై ఇంకా స్పష్టత లేదు. ఇక నిర్వాహకులు విడుదల చేసిన తాజా ప్రోమో, శనివారం నాటి ఎపిసోడ్ కు కంటిన్యూగానే కనిపిస్తోంది తప్ప, పెద్దగా ఆసక్తి కనిపించే అంశాల ప్రస్తావన లేకపోయిందని నెట్టింట కామెంట్లు వస్తున్నాయి. ఇక, ఎర్ర చీర కట్టుకుని, మెడ నిండుగా నక్లెస్ పెట్టుకుని బిగ్ బాస్ ను తనదైన శైలిలో నవ్విస్తూ నడిపిస్తున్న ప్రోమో ప్రతి ఒక్కరికీ చూడగానే నచ్చేసింది.