తరువాత కుదరదట... ఫ్లోరిడాలో అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసిన డొనాల్డ్ ట్రంప్!

25-10-2020 Sun 06:31
  • సౌత్ ఫ్లోరిడాలో ట్రంప్ కు ఓటు 
  • వెస్ట్ పామ్ బీచ్ లో ఓటేసిన ట్రంప్
  • ముందుగానే ఓటేసిన యూఎస్ అధ్యక్షుడు
Trump Casts His Vote in Florida

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని రోజుల సమయం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ప్రచారంలో బిజీగా ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నవంబర్ 3 ఓటింగ్ తేదీ కాగా, ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లో ఏర్పాటు చేసిన ఓ పోలింగ్ సెంటర్ లో ట్రంప్ ఓటేశారు. ఇక్కడ ఉన్న ఓ లైబ్రరీని పోలింగ్ కేంద్రంగా గతంలోనే గుర్తించి, ఓటింగ్ కు ఏర్పాటు చేశారు.

వాస్తవానికి న్యూయార్క్ లో ట్రంప్ ఇల్లు ఉండేది. కానీ గత సంవత్సరంలో తన రాష్ట్రాన్ని, చిరునామాను మారుస్తూ ఫ్లోరిడాకు ఓటును మార్చుకున్నారు. "నేను ట్రంప్ అనే పేరుతో ఉన్న వ్యక్తి ఓటును వేశాను" అని ఓటేసిన అనంతరం ట్రంప్ చిరునవ్వుతో వ్యాఖ్యానించారు. ఓటు వేస్తున్న సమయంలో ట్రంప్ మాస్క్ వేసుకుని కనిపించడం గమనార్హం. కాగా ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్న ట్రంప్ షెడ్యూల్ నవంబర్ 2 వరకూ ఫుల్ గా నిండిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆయన తన ఓటును ముందుగానే వేసేశారు. ట్రంప్ ఓటేసి వెళ్లేందుకు స్థానిక అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.