హత్రాస్‌ కేసును విచారిస్తున్న డీఐజీ భార్య ఆత్మహత్య

24-10-2020 Sat 21:44
  • ఉత్తరప్రదేశ్ లో విషాదకర ఘటన
  • ఉరి వేసుకుని చనిపోయిన డీఐజీ చంద్ర ప్రకాశ్ భార్య
  • ఘటనా స్థలిలో లభించని సూసైడ్ నోట్
DIG Chandra Prakash wife commits suicide

ఉత్తరప్రదేశ్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దేశ వ్యాప్తంగా కలకలం రేపిన హత్రాస్ కేసును సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిట్ సభ్యుల్లో ఒకరైన డీఐజీ చంద్ర ప్రకాశ్ భార్య పుష్ప (36) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఉదయం 11 గంటల ప్రాంతంలో లక్నోలోని వారి నివాసంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. ఈ ఘటనను గమనించిన కుటుంబసభ్యులు ఆమెను లోహియా ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసపత్రికి తరలించారు. ఈ ఘటనపై లక్నో ఈస్ట్ జోన్ డీసీపీ చారు నిగమ్ మాట్లాడుతూ, ఘటనా స్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని చెప్పారు.