నటి లువైనా ఆరోపణలను ఖండించిన మహేశ్ భట్

24-10-2020 Sat 18:32
  • మహేశ్ బాలీవుడ్ లో అతి పెద్ద డాన్ అని ఆరోపించిన లువైనా
  • తనను బెదిరిస్తున్నారని వ్యాఖ్య
  • చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న మహేశ్ లాయర్
Mahesh Bhatt condemns Luvienas allegations

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్ పై నటి లువైనా లోధ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మహేశ్ భట్, ఆయన కుటుంబసభ్యులు తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపించింది. ఈ అంశంపై మహేశ్ భట్ తరపున ఆయన లాయర్ స్పందించారు. మహేశ్ భట్ పై లువైనా చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఆయన తెలిపారు. లువైనా వ్యాఖ్యలు మహేశ్ భట్ పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని చెప్పారు. ఆమె ఆరోపణలను మహేశ్ భట్ ఖండిస్తున్నారని తెలిపారు. అసత్య ఆరోపణలు చేసిన లువైనాపై త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మహేశ్, ఆయన కుటుంబం తనను వేధిస్తున్నట్టు ఓ వీడియో ద్వారా లువైనా వెల్లడించింది. తన, తన కుటుంబ భద్రత కోసమే ఈ వీడియోను విడుదల చేస్తున్నట్టు తెలిపింది. మహేశ్ భట్ మేనల్లుడు సుమిత్ సబర్వాల్ ను తాను వివాహం చేసుకున్నట్టు తెలిపింది. సుమిత్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని... బాలీవుడ్ లో అతి పెద్ద డాన్ మహేశ్ భట్ అని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఎందరో జీవితాలను మహేశ్ నాశనం చేశారని చెప్పారు.