పార్టీలకు అతీతంగా భూఆక్రమణలను తొలగించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది: ఏపీ మంత్రి అవంతి 

24-10-2020 Sat 18:15
  • గీతం యాజమాన్యం ప్రభుత్వ భూములను ఆక్రమించింది
  • గీతం సంస్థ ఛారిటీ కాదు
  • గీతం యాజమాన్యంపై చంద్రబాబుకు అభిమానం లేదు
GITAM collecting lakhs of rupees for seats says Avanti Srinivas

విశాఖలోని గీతం యూనివర్శిటీ యాజమాన్యంపై మంతి అవంతి శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. మార్కెట్ ధరలకే భూములు తీసుకున్న గీతం యాజమాన్యం... ఆ తర్వాత ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించిందని చెప్పారు. పార్టీలకు అతీతంగా భూఆక్రమణలను తొలగించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని... ఇందులో భాగంగానే విశాఖలో చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

అక్రమ భూములను స్వాధీనం చేసుకుంటుంటే టీడీపీ నేతలకు అంత బాధ ఎందుకని ప్రశ్నించారు. గీతంపై టీడీపీకి అంత అభిమానం ఉంటే ఆ భూములను ఎందుకు క్రమబద్ధీకరించలేదని ప్రశ్నించారు.టీడీపీ అధినేత చంద్రబాబుకు గీతం యాజమాన్యంపై అంత అభిమానమేమీ లేదని అవంతి అన్నారు.

రాజకీయం కోసమే ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు అమరావతి ఉంటే చాలని ఎద్దేవా చేశారు. గీతం యూనివర్శిటీ అనేది ఛారిటీ సంస్థ కాదని... సీట్ల కోసం లక్షల రూపాయలు వసూలు చేస్తారని చెప్పారు. రిజర్వేషన్ రూల్ కూడా పాటించరని అన్నారు.