తాజా చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్న నితిన్?

24-10-2020 Sat 18:04
  • డబుల్ యాక్షన్ అంటే హీరోలకు క్రేజ్ 
  • చంద్రశేఖర్ యేలేటితో నితిన్ 'చెక్'  
  • హీరోయిన్లుగా రకుల్, ప్రియా ప్రకాశ్  
  • వైవిధ్యమైన రెండు పాత్రల్లో నితిన్?  
Nithin doing duel roles in his latest

కెరీర్లో ఒకసారైనా సరే డబుల్ యాక్షన్ పాత్రల్లో నటించాలని ప్రతి హీరో కోరుకుంటాడు. అందుకు తగ్గా కథ, పాత్రలు, వాటిని చక్కగా ప్రెజంట్ చేయగలిగే దర్శకుడు సెట్ అయినప్పుడు ఇక రంగంలోకి దిగిపోతాడు. ప్రస్తుతం యంగ్ హీరో నితిన్ కూడా ఇలాగే ఒక సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ తాజాగా ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రానికి 'చెక్' అనే టైటిల్ని కూడా నిర్ణయించి ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా వదిలారు. ఇందులోనే నితిన్ రెండు పాత్రలను పోషిస్తున్నాడని అంటున్నారు. ఈ చిత్రకథ చదరంగం ఆటలా ఎత్తులకు పైఎత్తులతో సాగుతుందట. అందుకే, 'చెక్' అనే టైటిల్ని కూడా నిర్ణయించినట్టు చెబుతున్నారు.

భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వరియర్ కథానాయికలుగా నటిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఇదిలావుంచితే, ప్రస్తుతం 'రంగ్ దే' చిత్రాన్ని పూర్తిచేసే పనిలో వున్న నితిన్.. మరోపక్క తన సొంత చిత్ర నిర్మాణ సంస్థలో 'అంధాదున్' చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు.