విజయసాయిరెడ్డికి గీతం సంస్థతో ఏం పని?: పట్టాభి

24-10-2020 Sat 16:14
  • కబ్జా చేసేందుకే విజయసాయి విశాఖలో మకాం వేశారు
  • ఎవరూ అడ్డుకోలేరన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు
  • 6 వేల ఎకరాల అసైన్డ్ భూమిని కబ్జా చేశారు
Vijayasai Reddy is staying in Vizag for land grabbing says Pattabhi

గీతం వంటి అత్యున్నత విద్యాసంస్థ విశాఖలో ఉండటం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి నచ్చడం లేదని టీడీపీ నాయకుడు పట్టాభి విమర్శించారు. పులివెందుల బ్యాచ్ తో బెదిరింపులకు పాల్పడుతూ 6వేల ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేసిన విజయసాయిరెడ్డికి గీతం యూనివర్శిటీతో పని ఏమిటని ప్రశ్నించారు. భూములు కబ్జా చేయడానికే విజయసాయి విశాఖలో మకాం వేశారని ఆరోపించారు. ఢిల్లీ పెద్దలకు వంగి నమస్కారాలు చేస్తున్న విజయసాయి... రాష్ట్రంలో తనను ఎవరూ అడ్డుకోలేరన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు.

గీతం సంస్థల ఛైర్మన్ భరత్ కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేకే ఆయన విద్యాసంస్థపై దాడికి దిగారని పట్టాభి అన్నారు. మొన్న విశాఖలో సబ్బం హరి ఇంటిపై, నిన్న విజయవాడలో తన ఇంటిపై, ఈరోజు భరత్ విద్యాసంస్థపై దాడి చేశారని మండిపడ్డారు. ప్రజల పక్షాన నిలబడకుండా చేయడానికే ఇలాంటి పనులకు తెగబడుతున్నారని చెప్పారు. కక్షసాధింపులను పక్కన పెట్టి, ప్రజల గురించి ఆలోచిస్తే మంచిదని ప్రభుత్వానికి హితవు పలికారు.