వివాదంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. రాజమౌళిపై ఆదివాసీల ఆగ్రహం!

24-10-2020 Sat 14:06
  • వివాదాస్పదమవుతున్న 'ఆర్ఆర్ఆర్' టీజర్
  • కుమ్రుం భీమ్ ముస్లిం టోపీ ధరించినట్టుగా సన్నివేశం
  • ఈ సన్నివేశాలను తొలగించాలని ఆదివాసీల డిమాండ్
Adivasis fires on Rajamouli

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా తారక్ పోషిస్తున్న గోండు వీరుడు కుమ్రం భీమ్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ లో కుమ్రం భీమ్ ముస్లిం టోపీ ధరించినట్టు చూపెట్టారు. ఈ సన్నివేశం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. కుమ్రుం భీమ్ కు టోపీ పెట్టడంపై ఆదివాసీలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని కుమ్రుం భీమ్ ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి కుమ్రుం భీమ్ యువసేన నేతలు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్ర యూనిట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమ్రుం భీమ్ కు టోపీ పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కుమ్రుం భీమ్ అని... ఆయన చరిత్రను పూర్తిగా అర్థం చేసుకుని సినిమా తీయాలని రాజమౌళికి చెపుతున్నామని అన్నారు. ఇష్టం వచ్చినట్టు సినిమా తీస్తూ, ఆదివాసీల మనోభావాలను దెబ్బతీయవద్దని చెప్పారు. టోపీ పెట్టుకున్న సన్నివేశాలను తొలగించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.