sanjay raut: ‘బీహార్‌లో అందరికీ వ్యాక్సిన్ ఉచితం’ హామీపై మండిపడ్డ శివసేన

  • మరి దేశంలోని మిగిలిన రాష్ట్రాలు పాక్‌లో ఉన్నాయా?
  • ఎన్నికల్లో గెలవడానికే బీజేపీ చెత్త రాజకీయాలు
  • వ్యాక్సిన్‌కు మతం, రాష్ట్రం ప్రాతిపదిక కాదని మోదీ గతంలో అన్నారు
  • ఇప్పుడు బీజేపీ వైఖరి మార్చుకుంది
sanjay raut on bjp manifesto

బీహార్‌లో ఈ నెల 28 నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసి, బీహార్‌లో కరోనా వ్యాక్సిన్‌ని అందరికీ ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్రలోని శివసేన పార్టీ నేత సంజయ్ రౌత్ ఈ విషయంపై స్పందిస్తూ తమ పత్రిక సామ్నాలో ఓ కథనం రాసుకొచ్చారు.

బీహార్‌లో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని అంటున్నారని, మరి దేశంలోని మిగిలిన రాష్ట్రాలు భారత్‌లో కాకుండా పాకిస్థాన్‌లో ఉన్నాయా? అంటూ ఆయన ప్రశ్నించారు.  బీహార్ అసెంబ్లీ‌ ఎన్నికల్లో గెలవడానికే బీజేపీ ఇటువంటి చెత్త రాజకీయాలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. దేశం మొత్తం కరోనా‌ బారిన పడుతున్నప్పుడు, బీహార్‌లో మాత్రమే ప్రత్యేక వ్యాక్సిన్‌ కోసం బీజేపీని గెలిపించాలని ఎందుకు అంటున్నారని ఆయన ప్రశ్నించారు.

కొవిడ్-19 విషయంలో వ్యాక్సిన్‌పై ఎందుకు రాజకీయాలు చేస్తారని ఆయన నిలదీశారు. వ్యాక్సిన్‌పై ఒక్క బీహార్‌కే కాకుండా దేశం మొత్తానికి సమాన హక్కులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.  ప్రధాని మోదీ అనేక సార్లు వ్యాక్సిన్ పై మాట్లాడుతూ.. దేశంలో అందరికీ వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తామని, కులం, మతం, రాష్ట్రం ప్రాతిపదిక కాదని చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీ వైఖరి మార్చుకోవడం, బీహార్‌ ఎన్నికల సందర్భంగా మరోలా మాట్లాడడం సరికాదని చెప్పారు.

More Telugu News