Pawan Kalyan: పలు ధార్మిక అంశాలను సులభంగా అర్థమయ్యేలా చెప్పారు.. శివస్వామీజీకి ధన్యవాదాలు: పవన్ కల్యాణ్

  • మంగళగిరి జనసేన కార్యాలయంలో నవరాత్రి వేడుకలు 
  • ఈ వేడుకలకు స్వామీజీ రావడం సంతోషకరం
  • హారతి కార్యక్రమం ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా సాగింది
Pawan Kalyan thanks Shiva Swamiji

శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామీజీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు స్వామీజీ మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

'సనాతన భారతీయ ధర్మంలో గురు వ్యవస్థకు ఇచ్చిన ప్రాధాన్యతను, మాతృమూర్తిని దైవ స్వరూపంగా కొలవడంలోని వైశిష్ట్యాన్ని చెపుతూ శైవక్షేత్ర పీఠాధిపతి శ్రీ శివస్వామీజీ చేసిన అనుగ్రహభాషణలోని ప్రతి అంశం విలువైనదే. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి వేడుకలకు శ్రీ శివస్వామీజీ హాజరు కావడం ఎంతో సంతోషదాయకం. స్వామీజీ తన ప్రవచనంలో పలు ధార్మిక అంశాలను సులభంగా అర్థమయ్యేలా తెలిపారు.

అరిషడ్వర్గాలను జయించడమే ఈ నవరాత్రులకు ఇచ్చే గురుదక్షిణగా భావించాలని ఉద్బోధిస్తూ సత్యం, ధర్మం, నీతి నిజాయతీలనే పునాదులపై భారతీయ సమాజం బలంగా నిలిచి ఉందనే విషయాన్ని ప్రభావశీలంగా చెప్పారు. మన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను చెపుతూ ఆశీర్వదించిన శ్రీ శివస్వామీజీకి సభక్తికంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

పార్టీ కార్యాలయంలో ఈ శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా సాగిన హారతి కార్యక్రమం ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా సాగింది. పూజాదికాలు, హారతి నిర్వహించిన పురోహితుల బృందానికి, ఈ వేడుకలను ఎంతో సంప్రదాయబద్దంగా చేపడుతున్న నాయకులకు, ఆడపడుచులకు, చిన్నారులకు, కార్యాలయ సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను' అని పవన్ చెప్పారు.

More Telugu News