ఐపీఎల్‌లో ఘోర వైఫల్యంపై సీఎస్కే జట్టు సారథి ధోనీ ఆవేదన!

24-10-2020 Sat 12:36
  • మా ప్రదర్శన పట్ల చాలా బాధపడుతున్నాను
  • ఎక్కడ తప్పు జరుగుతోందో తెలుసుకోవాల్సి ఉంది
  • రెండు మ్యాచ్‌లలోనే బాగా రాణించాం
  • బ్యాట్స్‌మెన్‌ అంతా విఫలమవుతున్నారు
dhoni on csk ipl performance

షార్జాలో నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచులో ముంబై ఇండియన్స్ చేతిలో  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చిత్తుగా ఓడి  అభిమానులను తీవ్ర నిరాశపర్చిన విషయం తెలిసిందే. గత సీజన్లలో దూకుడుగా ఆడి ఐపీఎల్‌లోని మజాను రుచి చూపించిన ఆ జట్టు ఈ సారి మాత్రం ఘోరంగా విఫలం కావడం గమనార్హం. దీనిపై  ఆ జట్టు కెప్టెన్ ధోనీ స్పందిస్తూ...  తమ ప్రదర్శన పట్ల చాలా బాధపడుతున్నట్లు చెప్పాడు.

ఎక్కడ తప్పు జరుగుతోందో తెలుసుకోవాల్సి ఉందని, ఈ సీజన్‌లో తాము ఒకటి, రెండు మ్యాచ్లలోనే బాగా రాణించామని తెలిపాడు. రాయుడికి గాయమైందని, మిగతా బ్యాట్స్‌మెన్‌ అంతా విఫలమవుతున్నారని చెప్పాడు. దీంతో వాళ్లపై ఒత్తిడి పెరిగిందని,  టాప్‌ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రాణించకపోతే మిడిల్‌ ఆర్డర్‌పై ప్రభావం చూపుతుందని చెప్పాడు.

క్రికెట్‌లో ఓటములు ఎదురవుతుంటే కాస్త అదృష్టం కూడా కలిసిరావాలని ఆయన అన్నాడు, అయితే, ఈ సీజన్‌లో మాత్రం తమకు అలా జరగలేదని, తాము టాస్‌లు గెలవలేదని చెప్పాడు. దీంతో తాము కొన్నిసార్లు రెండో ఇన్నింగ్స్‌లో ఆడాల్సి వచ్చిందని, అప్పుడు తేమ కూడా ప్రభావం చూపలేకపోయిందని చెప్పుకొచ్చాడు.

జట్టులో ఉండే ఆటగాళ్లు మైదానంలో వాళ్ల స్థాయికి తగ్గట్లుగా ప్రదర్శన చేస్తున్నారా? అనేది జట్టు చూసుకోవాలని, తాము ఈ సారి ఈ విషయాన్ని చూసుకోలేకపోయామని చెప్పాడు. నలుగురు బ్యాట్స్‌మెన్ రాణించకపోతే అది ఇబ్బందిగా ఉంటుందని చెప్పాడు. అయితే, అవన్నీ ఆటలో భాగమేనని తాను భావిస్తానని తెలిపాడు.  కుర్రాళ్లకి అవకాశం ఇచ్చి తదుపరి సీజన్‌ కోసం వాళ్లని సన్నద్ధం చేయాలని, సరైన బ్యాట్స్‌మెన్‌, బౌలర్లను గుర్తించాలని ఆయన అభిప్రాయపడ్డాడు.