అలబామాలో కూలిన యూఎస్ నౌకాదళ విమానం!

24-10-2020 Sat 10:29
  • ఇద్దరు పైలట్లతో బయలుదేరిన చిన్న విమానం
  • నివాస ప్రాంతంలో కుప్పకూలిన వైనం
  • పలు కార్లకు అంటుకున్న నిప్పు
US Navy Flight Crashed in Alabama

అలబామాలో అమెరికా నౌకాదళానికి చెందిన రెండు సీటర్ల విమానం కుప్పకూలగా, అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు నేవీ సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఈ విమానం టీ-6బీ టెక్సన్-2 రకానికి చెందినదని, సాయంత్రం 5 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) ఫోలే ప్రాంతంలో ప్రమాదానికి గురైందని ఫ్లయ్ నేవీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి పేర్లను నిబంధనల ప్రకారం, 24 గంటల తరువాత వెల్లడిస్తామని తెలిపింది.

కాగా, ఈ విమానం నివాస ప్రాంతాల్లో పడటంతో పలు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. పౌర నష్టం జరిగిందా? అనే విషయమై ఎటువంటి సమాచారమూ లేదని అధికారులు తెలిపారు. జరిగిన ప్రమాదంపై విచారణకు ఆదేశించామని చెప్పారు. ఘటన జరిగిన విషయం తెలియగానే ఫైర్ ఫైటర్లు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని అన్నారు.