వచ్చే నెలలో కోవాగ్జిన్‌కు మూడో దశ పరీక్షలు.. మే నాటికి అందుబాటులోకి

24-10-2020 Sat 09:33
  • నవంబరులో భారీ ఎత్తున మూడో దశ క్లినికల్ పరీక్షలు
  • దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో 26 వేల మందికి టీకా
  • అందుబాటులోకి వస్తే తొలుత ఫ్రంట్ లైన్ వారియర్లకే
India made Covaxin cleared for Phase III trials

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా కోవాగ్జిన్ వచ్చే ఏడాది ఏప్రిల్, మే నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని కనుక ప్రభుత్వం భావిస్తే అంతకంటే ముందే ఇది అందుబాటులోకి వస్తుంది. ఇప్పటి వరకు ఈ టీకాకు నిర్వహించిన పరీక్షల సమాచారం ఆధారంగా కోవాగ్జిన్‌కు అత్యవసర అనుమతి  ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. నవంబరులో ఈ టీకాకు మూడో దశ క్లినికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది.

దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో 26 వేల మంది వలంటీర్లపై టీకాను పరీక్షించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి టీకా పరీక్షలు పూర్తవుతాయి. అనంతరం అత్యవసర వినియోగానికి అనుమతి లభించే అవకాశం ఉంది. కాగా, దేశంలో ఇంత భారీ స్థాయిలో మూడో దశ పరీక్షలు నిర్వహిస్తుండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇందుకోసం భారత్ బయోటెక్ రూ. 1.50 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. కోవాగ్జిన్‌కు అత్యవసర అనుమతి లభిస్తే కరోనా పోరులో ముందున్న వైద్యులు, నర్సులు, అత్యవసర సేవల వారికి, టీచర్లు, ఆయిల్ అండ్ గ్యాస్ రంగానికి చెందిన సిబ్బందికి తొలుత ఇస్తారు.