మిలటరీ క్యాంటీన్లలో విదేశీ వస్తువుల విక్రయం బంద్.. రక్షణ శాఖ నిర్ణయం

24-10-2020 Sat 08:29
  • విదేశీ మద్యం సహా ఇతర వస్తువుల విక్రయంపై నిషేధం
  • దిగుమతులు ఆపేయాలంటూ ఉత్తర్వులు
  • ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అధికారులతో జరిగిన సమావేశంలో నిర్ణయం
Indian govt bans imported goods selling at army canteens

దేశంలోని మిలటరీ క్యాంటీన్లలో ఇకపై విదేశీ వస్తువులు విక్రయించరాదని భారత రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రస్తుతం 4 వేల మిలటరీ క్యాంటీన్లు ఉండగా, వాటిలో విదేశీ మద్యంతోపాటు ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా విక్రయిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ స్వదేశీ వస్తువుల విక్రయం నినాదానికి మద్దతుగా మిలటరీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అధికారులతో నిన్న జరిగిన సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.  

ఇకపై విదేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకోరాదని రక్షణ శాఖ జారీ చేసిన అంతర్గత ఉత్తర్వుల్లో పేర్కొంది. మిలటరీ క్యాంటీన్లలో ప్రస్తుతం సైనికులు, మాజీ సైనికుల కుటుంబాలకు విదేశీ మద్యంతోపాటు ఎలక్ట్రానిక్ వస్తువులను విక్రయిస్తున్నారు. చైనాతో ఇటీవల తలెత్తిన ఘర్షణల నేపథ్యంలో చైనా వస్తువుల దిగుమతులపై ఇప్పటికే కేంద్రం పలు రకాల ఆంక్షలు విధించింది. తాజాగా, ఇప్పుడీ నిర్ణయం తీసుకుంది.