Pakistan: ఇప్పటికీ ఉగ్రవాదులకు నిధులిస్తున్న పాకిస్థాన్... 'గ్రే లిస్ట్' లోనే పాక్!

  • ఉగ్రవాదులకు సహకారాన్ని ఆపని పాకిస్థాన్
  • మూడు రోజుల ఎఫ్ఏటీఎఫ్ సమావేశాల్లో నిర్ణయం
  • 27 నిబంధనల్లో ఆరింటిని పాటించని పాకిస్థాన్
  • పలు సంస్థల నుంచి పాక్ కు రాని నిధులు
Pak Will Continue in Gray List

వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు ఎఫ్‌ఏటీఎఫ్ ‌(ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌)కు సంబంధించి గ్రే లిస్ట్‌ లోనే పాకిస్థాన్ ఉంటుంది. ఎంతగా హెచ్చరించినా, ఉగ్రవాదులకు నిధులను సమకూర్చడం పాకిస్థాన్ ఆపలేదన్న అంచనాకు వచ్చిన ఎఫ్ఏటీఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం, నగదు అక్రమ రవాణా నివారణకు దేశాలు తీసుకుంటున్న చర్యల ఆధారంగా ఈ జాబితాను తయారు చేస్తారన్న సంగతి తెలిసిందే.

తాము సూచించిన నిర్ణయాలను అమలు చేసి, 27 పాయింట్లలో ఆరు పాయింట్లను పాకిస్థాన్ పొందలేకపోయిందని, అందువల్లే ఆ దేశం మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరుతూ, గ్రే లిస్ట్ లోనే కొనసాగించాలని నిర్ణయించినట్టు ఎఫ్ఏటీఎఫ్ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ఇస్లామాబాద్ తమ సూచనలకు తగిన అన్ని నిర్ణయాలూ తీసుకుంటే, ఆంక్షలను తొలగించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మొత్తం 27 పాయింట్లలో 21 పాయింట్లను మాత్రమే పాక్ పొందిందని తెలిపాయి. మరో ఆరు నిబంధనలను పాక్ అమలు చేయాల్సి వుందని స్పష్టం చేసింది.

కాగా, పాకిస్థాన్ లోని ఉగ్రవాద సంస్థలకు యూఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల నుంచి నిధులు వస్తుండగా, వాటిని అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ఇక, పాకిస్థాన్ గ్రే లిస్ట్ లో కొనసాగుతూనే ఉండటంతో, ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్), వరల్డ్ బ్యాంక్, ఏడీబీ (ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్), యూరోపియన్ యూనియన్ తదితరాల నుంచి ఆర్థిక సహాయం పొందే వీలు లేదన్న సంగతి తెలిసిందే.

ఇంటర్నేషనల్ టెర్రరిస్టులుగా ముద్రపడిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్‌ అజర్, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్‌ సయీద్, ఆపరేషనల్ కమాండర్ జకీఉర్‌ రహమాన్‌ లఖ్వీ తదితరులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఎఫ్ఏటీఎఫ్ నిబంధన విధించగా, పాకిస్థాన్ విఫలమైంది. ఎఫ్‌ఏటీఎఫ్‌ ప్లీనరీ సమావేశాలు బుధ, గురు, శుక్రవారాల్లో వర్చువల్‌ విధానంలో జరుగగా, పాక్ ను గ్రే లిస్ట్ లోనే ఉంచాలన్న నిర్ణయం వెలువడింది.

More Telugu News