MS Dhoni: ఈ ఐపీఎల్ సీజన్ కు చెన్నై ఖేల్ ఖతమ్... ఇక ధోనీ వద్దంటూ నెట్టింట తంబీల డిమాండ్!

  • గత రాత్రి ముంబై చేతిలో ఘోర ఓటమి
  • ఓటమితో ఈ సీజన్ నుంచి వైదొలగిన సీఎస్కే
  • ఇక ధోనీ కెప్టెన్ గా వద్దని డిమాండ్
Tamil IPL Fans Demand to Remove MSD

గత రాత్రి షార్జాలో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో ఘోర ఓటమి పాలైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, ఈ సంవత్సరం ఐపీఎల్ పోటీల నుంచి పూర్తిగా నిష్క్రమించింది. గడచిన పది సీజన్లలో టాప్-4లో ఉండి కనీసం ప్లే ఆఫ్ వరకూ వెళ్లిన సీఎస్కే, ఈ సంవత్సరం మాత్రం పేలవ ప్రదర్శనతో పాతాళానికి పడిపోవడం చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఎంతో మంది సీఎస్కే ఫ్యాన్స్, ఇక తమ జట్టుకు కెప్టెన్ గా ధోనీ వద్దంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇంత అవమానకర నిష్క్రమణను తాము భరించలేకపోతున్నామని వాపోతున్నారు.

కాగా, ఈ సీజన్ లో ఇంతవరకూ 11 మ్యాచ్ లను ఆడిన చెన్నై జట్టు 8 మ్యాచ్ లలో ఓడిపోయింది. గెలిచింది 3 మ్యాచ్ లు కాగా, మరో మూడు మ్యాచ్ లను మాత్రమే సీఎస్కే ఆడాల్సి వుంది. ఆ మూడు మ్యాచ్ లలో గెలిచినా, గరిష్ఠంగా 12 పాయింట్లు మాత్రమే వస్తాయి. ప్లే ఆఫ్ కు వెళ్లేందుకు ఆ పాయింట్లు సరిపోవు.

ఎందుకంటే, 12 పాయింట్ల కన్నా ఎక్కువ పాయింట్లను సంపాదించుకున్న టీమ్ లు మూడు ఉండగా, 10 మ్యాచ్ లు ఆడి 10 పాయింట్లతో కేకేఆర్, 8 పాయింట్లతో సన్ రైజర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ లు పోటీలో ఉన్నాయి. ఈ టీమ్ ల చేతిలో మరో నాలుగు మ్యాచ్ లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాంకేతికంగానూ చెన్నై జట్టు ప్లే ఆఫ్ కు చేరే అవకాశాలు లేవు.

దీంతో సీఎస్కే టీమ్ పై, ముఖ్యంగా ధోనీపై విమర్శల వర్షం కురుస్తోంది. ఇప్పటికే క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న ధోనీని కెప్టెన్ గా ఉంచడంపైనా తమిళ తంబీలు, ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ధోనీ ఇక ఐపీఎల్ నుంచి కూడా తప్పుకునే సమయం ఆసన్నమైందని అంటున్నారు. కాగా, నిన్న చెన్నై టీమ్ లో ఆల్ రౌండర్ శామ్ కరన్ మినహా మరెవరూ రాణించ లేదు. ఈ మ్యాచ్ లో ముంబై జట్టు, చెన్నై విధించిన 114 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించిన సంగతి తెలిసిందే.

More Telugu News