నిబంధనలు సడలించిన రైల్వేశాఖ.. స్టేషన్‌కు ఇక గంటన్నర ముందు రానవసరం లేదు!

24-10-2020 Sat 07:35
  • సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లలో అత్యాధునిక థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు
  • స్టేషన్లలోని క్యాంటీన్లు, రెస్టారెంట్లలో తినేందుకు అనుమతి నిరాకరణ
  • లగేజీ ఉన్నవారు మాత్రం కొంత సమయం ముందు రావాలన్న అధికారులు
now railway passengers can come to station as before

కరోనా నేపథ్యంలో ప్రయాణ సమయానికి గంటన్నర ముందుగానే స్టేషన్‌కు రావాలన్న నిబంధనను రైల్వే సడలించింది. ఇక ఆ అవసరం లేదని, ఇంతకుముందులానే అరగంటముందు వస్తే సరిపోతుందని పేర్కొంది. ఇప్పటి వరకు స్టేషన్‌కు వచ్చే ప్రతీ ప్రయాణికుడిని పరీక్షించి లోపలికి పంపేవారు. దీనివల్ల సమయం బాగా వృథా అయ్యేది. అందుకనే ప్రయాణికులు కనీసం గంటన్నర ముందు రావాలన్న నిబంధన పెట్టారు.

ఇప్పుడు సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో లేజర్ టెక్నాలజీ సాయంతో అత్యాధునిక థర్మల్ స్క్రీనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఫలితంగా ప్రయాణికులు లోపలికి అడుగుపెట్టిన వెంటనే అవి దానంతట అవే వారి శరీర ఉష్ణోగ్రతను అంచనా వేస్తాయి. కాబట్టి సమయం ఆదా అవుతుండడంతో గంటన్నర ముందుగా రావాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

రైల్వే స్టేషన్లలోకి ప్రయాణికులను మినహా మరెవరినీ అనుమతించకపోవడంతో లగేజీ ఉన్నవారు మాత్రం కొంత ముందు వచ్చి అక్కడి రైల్వే కూలీల సాయం పొందవచ్చని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్లలోని క్యాంటీన్లు, రెస్టారెంట్లలో తినేందుకు అనుమతించడం లేదు. ప్యాక్ చేసిన ఆహారాన్ని మాత్రం కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే, రైళ్లలోకి టీ, కాఫీ విక్రేతలను అనుమతించడం లేదు. రైళ్లను, ప్లాట్ ఫారాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.