ధరణి పోర్టల్ ప్రారంభం ఈ నెల 29కి వాయిదా

23-10-2020 Fri 21:21
  • ధరణి ప్రారంభోత్సవ షెడ్యూల్ లో మార్పు
  • వర్షాలు, వరదలతో పోర్టల్ ఆస్తుల నమోదు ఆలస్యం
  • తాజాగా ప్రకటన చేసిన సీఎంఓ
Dharani portal inauguration postponed

సమీకృత భూ రికార్డుల యాజమాన్య విధానం (ధరణి) పోర్టల్ ప్రారంభం వాయిదా పడింది. వాస్తవానికి దసరా సందర్భంగా ధరణి పోర్టల్ ప్రారంభించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావించారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ పోర్టల్ లో ఆస్తుల నమోదు ప్రక్రియ ఆశించిన వేగంతో జరగలేదు.

దీనిపై సీఎంఓ తాజా ప్రకటన చేసింది. ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ను ప్రారంభిస్తారని సీఎంఓ వెల్లడించింది. సీఎం కేసీఆర్ గతంలో అనేక కీలక నిర్ణయాలు దసరా సందర్భంగానే అమలు చేశారు. అయితే, ధరణి పోర్టల్ ప్రారంభోత్సవం మాత్రం వరుణుడి కారణంగా ఆలస్యం కానుంది.