ఓటుకు నోటు కేసు విచారణ ఈ నెల 27కి వాయిదా

23-10-2020 Fri 19:14
  • ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ
  • సండ్ర, ఉదయసింహ డిశ్చార్జి పిటిషన్లు కొట్టివేయాలన్న ఏసీబీ అధికారులు
  • సండ్ర వాదనల్లో నిజంలేదని స్పష్టీకరణ
Cash for vote case hearing adjourned

నాడు సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణ ఈ నెల 27కి వాయిదా పడింది. ఈ కేసు విచారణ ఏసీబీ కోర్టులో జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజా విచారణ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఉదయసింహ డిశ్చార్జి పిటిషన్లపై ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. వాదనల సందర్భంగా... సండ్ర చెబుతున్న అంశాల్లో వాస్తవం లేదని ఏసీబీ అధికారులు ఆరోపించారు.

తన ప్రమేయం లేకుండానే తనను ఈ కేసులోకి లాగారని సండ్ర చెబుతున్నది అవాస్తవమని, ఆయన ప్రమేయం ఉన్నందునే అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు. వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు స్టీఫెన్ సన్ ను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని తెలిపారు. సండ్ర, ఉదయసింహ దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లను కొట్టివేయాలని ఏసీబీ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న పిమ్మట న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.