చంద్రబాబు, లోకేశ్ చెబితే పని చేయాల్సిన స్థితిలో మా ప్రభుత్వం లేదు: మంత్రి కన్నబాబు

23-10-2020 Fri 18:43
  • లోకేశ్ మాటను వాళ్ల పార్టీ వాళ్లే వినరని ఎద్దేవా
  • తమ బాధ్యతలేంటో తమకు తెలుసని స్పష్టీకరణ
  • అమరావతి ఏ ఒక్కరికో నోటిఫై కాలేదని వెల్లడి
AP Minister Kannababu slams Chandrababu and Lokesh

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు టీడీపీ అధినాయకత్వంపై విమర్శలు చేశారు. చంద్రబాబు, లోకేశ్ చెబితే పనిచేయాల్సిన స్థితిలో తమ ప్రభుత్వం లేదని అన్నారు. వాళ్లిద్దరూ చెబితేనే రాష్ట్రంలో పాలన జరగడంలేదని అన్నారు. తమ బాధ్యతలేంటో తమకు తెలుసని స్పష్టం చేశారు.

లోకేశ్ కొత్తగా వరద ప్రాంతాల్లో పర్యటించి ఉంటాడని అందుకు అలా మాట్లాడుతుండొచ్చని ఎద్దేవా చేశారు. అయినా, లోకేశ్ మాటను వాళ్ల పార్టీ కార్యకర్తలే వినరని వ్యాఖ్యానించారు. తండ్రీ కొడుకులు హైదరాబాదులో మకాం వేసి రాష్ట్రంపై పెత్తనం చేస్తున్నారని కన్నబాబు విమర్శించారు.

అమరావతిలో అందరికీ అవకాశం ఉంటుందని, అమరావతి ఏ ఒక్కరికో నోటిఫై చేసిన ప్రాంతం కాదని అన్నారు. అమరావతిలో పేదలు, దళితులు కూడా ఇళ్ల స్థలాలు పొందే హక్కు ఉందని స్పష్టం చేశారు. పెత్తనం చేయాలని చూస్తే సహించబోమని మంత్రి హెచ్చరించారు.