ఒకే రోజు ఏడు హత్యలు చేశాడు... 16 ఏళ్ల తర్వాత ఎస్సార్ నగర్ పోలీసులకు దొరికిన వైనం!

23-10-2020 Fri 17:12
  • కరుడుగట్టిన రౌడీ షీటర్ డేవిడ్ రాజు అరెస్ట్
  • కృష్ణా జిల్లాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • 1991 నుంచి వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు
SR Nagar police nabbed hardcore murderer David Raju in Krishna district

హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీసులు డేవిడ్ రాజు అనే కరుడుగట్టిన రౌడీషీటర్ ను అరెస్ట్ చేశారు. డేవిడ్ రాజు గతంలో ఒకే రోజు ఏడు హత్యలు చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అప్పట్లో ఎర్రగడ్డలో జరిగిన ఈ హత్యలు సంచలనం సృష్టించాయి. గత 16 సంవత్సరాలుగా ఈ రౌడీషీటర్ పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు.

అతడిపై 1991లో ఎస్సార్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా అనేక ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అయితే, డేవిడ్ రాజు ఏపీలోని కృష్ణా జిల్లాలో ఉన్నట్టు సమాచారం అందుకున్న ఎస్సార్ నగర్ పోలీసులు పక్కా ప్లాన్ తో అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ రౌడీషీటర్ ను హైదరాబాద్ తరలించి కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.