జమిలీ ఎన్నికలు వస్తున్నాయి.. సిద్ధంగా ఉండండి: గల్లా జయదేవ్

23-10-2020 Fri 16:46
  • 2022లో జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి
  • టీడీపీ విజయం సాధించడం ఖాయం
  • జగన్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు
Jamili elections will be held in 2022 says Galla Jayadev

జమిలి ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని ఆయన చెప్పారు. జమిలీ ఎన్నికలు జరుగుతాయనే చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతోందని అన్నారు. 2022లో జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయని... మనమంతా సర్వసన్నద్ధంగా ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. ధర్మం మనవైపే ఉందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరితగతిన విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని గల్లా జయదేవ్ అన్నారు. ఈ కారణంగానే న్యాయ వ్యవస్థనే దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. కేసుల్లో శిక్షపడి జైలుకు వెళ్లినా... ప్రజల్లో సానుభూతి ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడిగా నేడు తెనాలి శ్రవణ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా గల్లా జయదేవ్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.