మోహన్ బాబు 'సన్నాఫ్ ఇండియా' షూటింగ్ ప్రారంభం

23-10-2020 Fri 14:20
  • మోహన్ బాబు నివాసంలో పూజా కార్యక్రమాలు
  • నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్
  • డైమండ్ రత్నబాబు డైరెక్షన్ లో చిత్రం
Mohan Babu Son Of Indian shoot begins today

సీనియర్ నటుడు మోహన్ బాబు లీడ్ రోల్ పోషిస్తున్న 'సన్నాఫ్ ఇండియా' చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాదులోని మోహన్ బాబు నివాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంచు లక్ష్మి, ఆమె కుమార్తె విద్యా నిర్వాణ క్లాప్ కొట్టగా, మంచు విష్ణు అర్ధాంగి విరానికా, కుమార్తె ఐరా, కుమారుడు అవ్రామ్ కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తం షాట్ కు మంచు విష్ణు దర్శకత్వం వహించారు. మంచు విష్ణు కవల కుమార్తెలు అరియానా, వివియానా చేతులమీదుగా చిత్రబృందం స్క్రిప్టు అందుకుంది.

రచయిత డైమండ్ రత్నబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నేటి నుంచి 'సన్నాఫ్ ఇండియా' రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. దేశభక్తి ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కన్నుట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మోహన్ బాబు ఇటీవల తన చిత్రాల స్పీడు పెంచారు. ఆయన తమిళ హీరో సూర్య నటిస్తున్న 'ఆకాశమే నీ హద్దురా' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు, మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న 'పొన్నియిన్ సెల్వన్' అనే చిత్రంలోనూ నటిస్తున్నారు.