పాట పాడుతూ.. కంటతడి పెట్టుకున్న సింగర్‌ మనో

23-10-2020 Fri 13:08
  • దసరా పండుగ నేపథ్యంలో ఈటీవీలో ప్రోగ్రాం
  • 'సూర్యుడే సెలవని విడిచిపోయేనా'  అంటూ బాలుపై పాట
  • బాల సుబ్రహ్మణ్యాన్ని చూస్తూ పెరిగానన్న మనో
  • బాలు అందర్నీ సమానంగా చూసే గొప్ప వ్యక్తని వ్యాఖ్య
singer mano tears

దసరా పండుగ నేపథ్యంలో ఈటీవీలో ప్రసారం కానున్న ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ గాయకుడు మనో కంటతడి పెట్టుకున్నారు. దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి, మనోకి మంచి అనుబంధం ఉండేదన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో  ఎస్పీ బాలుకి నివాళులర్పిస్తూ మనో, ఉష కలిసి 'సూర్యుడే సెలవని విడిచిపోయేనా'  పాటను పాడారు.

దీంతో పాట పాడుతున్న సమయంలోనే మనో భావోద్వేగానికి గురై కన్నీరు కార్చారు. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంగీత, నవదీప్‌, సుధీర్ వంటి వారంతా కలిసి ఆయనను ఓదార్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయన భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేకపోయారు.

తాను బాల సుబ్రహ్మణ్యాన్ని చూస్తూ పెరిగానని, ఆయన అందర్నీ సమానంగా చూసే గొప్ప వ్యక్తని చెప్పారు. బాలు మన మధ్య లేరంటే తాను తట్టుకోలేకపోతున్నానని తెలిపారు. కాగా 'అక్కా ఎవరే అతగాడు?' అనే పేరుతో రూపొందించిన ఈ కార్యక్రమం దసరా సందర్భంగా ఆదివారం ప్రసారం కానుంది. మృతి చెందిన తెలుగు హాస్యనటులపై కూడా ఇందులో ఓ స్కిట్ చేశారు. దీంతో కార్యక్రమంలో పాల్గొన్న వారు అందరూ భావోద్వేగానికి గురికావడం ఇందులో చూడొచ్చు.