సవాల్ విసిరిన సంజయ్ పత్తా లేకుండా పోయాడు: హరీశ్ రావు

23-10-2020 Fri 12:16
  • బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ 
  • కాంగ్రెస్, బీజేపీ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు
  • దుబ్బాకలో టీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి
Where is Bandi Sanjay asks Harish Rao

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పెన్షన్లపై చర్చకు రమ్మని సవాల్ విసిరిన సంజయ్ పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ అని విమర్శించారు. మోదీ ప్రధాని అయితే కోటి ఉద్యాగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ... ఈ ఆరేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. ఉద్యోగాల గురించి బీజేపీ నేతలు మాట్లాడుతుండటం హాస్యాస్పదమని చెప్పారు.

కాంగ్రెస్ కు ఓటేస్తే కాలిపోయే మోటార్లను ఇస్తారని... బీజేపీకి ఓటేస్తే బాయి కాడ మీటర్లను పెడతారని హరీశ్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తూ ఓట్లు అడుగుతున్నారని చెప్పారు. కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో క్యూలైన్లలో చెప్పులు పెడితే తప్ప ఎరువు బస్తా దొరికేది కాదని అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.