ప్లెక్సీ కడుతూ కరెంట్ షాక్ తో ప్రభాస్ అభిమాని దుర్మరణం!

23-10-2020 Fri 10:12
  • ప్రకాశం జిల్లాలో ఘటన
  • మరో నలుగురికి తీవ్రగాయాలు
  • పూనూరులో విషాద వాతావరణం
Prabhas Fan died with Current Shock

తన అభిమాన నటుడు పుట్టిన రోజున భారీ ప్లెక్సీ కట్టి, సెలబ్రేషన్స్ చేసుకోవాలని భావించిన ఆ అభిమానికి అదే ఆఖరు రోజైంది. నేడు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కాగా, ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం పూనురులో సుగుణా రావు అనే అభిమాని పెద్ద ప్లెక్సీని తయారు చేయించాడు.

దాన్ని బహిరంగంగా ప్రదర్శించాలన్న ఉద్దేశంతో కడుతున్న వేళ, పక్కనే ఉన్న విద్యుత్ వైర్లు సుగుణా రావుకు తగిలాయి. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఇదే ఘటనలో ప్లెక్సీ కట్టేందుకు సాయం చేస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనతో పూనురులో విషాద వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలిని సందర్శించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు.