Corona Virus: ఎన్నికల హామీ 'కరోనా ఫ్రీ వ్యాక్సిన్'.. కాంగ్రెస్ సెటైర్!

Rahul Gandhi slams BJP for free vaccine statement
  • బీహార్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత టీకా అంశం  
  • కాసేపటికే తమిళనాడు ముఖ్యమంత్రి కూడా ఉచిత హామీ
  • విరుచుకుపడుతున్న విపక్షాలు
ఇంకా ట్రయల్స్ దశలోనే ఉన్న కరోనా టీకా అప్పుడే రాజకీయ పార్టీల ఎన్నికల హామీగా మారిపోయింది. ఎన్నికల వాగ్దానంగా అప్పుడే ప్రజల్లోకి వెళ్లిపోయింది. నిజానికి వ్యాక్సిన్ అందుబాటులో ఎప్పుడు వచ్చేది ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు.

వ్యాక్సిన్ఈ ఏడాది చివరి నాటికి వస్తుందని కొందరు అంటుంటే, వచ్చే ఏడాది తొలి అర్ధభాగం తర్వాత వస్తుందని ఇంకొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం మరో రెండేళ్ల వరకు చెప్పలేమని కరాఖండీగా చెబుతున్నారు. అయితే, వాక్సిన్ సంగతి ఎలా ఉన్నా అది మాత్రం అప్పుడే పార్టీల మేనిఫెస్టోలో ఒక అంశంగా మారిపోయింది.

తాము అధికారంలోకి వస్తే బీహార్ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని నిన్న విడుదల చేసిన బీహార్ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ పేర్కొంది. ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయని, ఐసీఎంఆర్ నుంచి క్లియరెన్స్ వచ్చిన వెంటనే బీహార్ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.  

మరోవైపు, వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడు సీఎం కూడా కరోనా వ్యాక్సిన్‌పై ప్రజలకు ఉచిత హామీ ఇచ్చారు. టీకా అందుబాటులోకి రాగానే తమిళ ప్రజలందరికీ దానిని ఉచితంగా వేస్తామని హామీ ఇచ్చారు. బీహార్‌లో బీజేపీ ప్రకటించిన కాసేపటికే ముఖ్యమంత్రి పళనిస్వామి ఈ ప్రకటన చేయడం గమనార్హం.

కాగా, బీజేపీ కరోనా టీకా ఉచిత హామీపై కాంగ్రెస్ సహా విపక్షాలు మండిపడ్డాయి. కరోనా టీకా ఉచితంగా ఎప్పుడు లభిస్తుందో తెలుసుకోవాలంటే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయో తెలుసుకోవాల్సి ఉంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చురకలు అంటించారు. ఇలాంటి బూటకపు హామీలు బీజేపీకి అలవాటేనని మండిపడ్డారు.
Corona Virus
covid vaccine
bihar
Tamil Nadu
BJP
Congress

More Telugu News