రాజస్థాన్‌ను చిత్తుగా ఓడించిన హైదరాబాద్

23-10-2020 Fri 06:38
  • 8 వికెట్ల తేడాతో ఘన విజయం
  • ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకున్న ఎస్ఆర్‌హెచ్
  • రాజస్థాన్ ఇక ఇంటికే
sun risers hyderabad defeat rajasthan royals

దుబాయ్ వేదికగా నిన్న రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 155 పరుగుల ఓ మాదిరి విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్.. మరో 11 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని సొంతం చేసుకుంది.

కెప్టెన్ డేవిడ్ వార్నర్ (4), బెయిర్ స్టో (10) త్వరగానే పెవిలియన్ చేరినప్పటికీ మనీష్ పాండే ధనాధన్ ఇన్నింగ్స్‌కు తోడు, విజయశంకర్ అర్ధ సెంచరీతో అదరగొట్టడంతో భారీ విజయాన్ని అందుకుంది. 47 బంతులు ఎదుర్కొన్న మనీష్ పాండే 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు. 51 బంతులాడిన విజయ్ శంకర్ 6 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. విజయంలో కీలక పాత్ర పోషించిన మనీష్ పాండేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ హోల్డర్ దెబ్బకు విలవిల్లాడింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులే చేయగలిగింది. హోల్డర్ నిప్పులు చెరిగేలా బంతులు విసురుతుంటే పరుగులు తీసేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. ముఖ్యంగా కీలకమైన డెత్ ఓవర్లలో పరుగులు రావడం అసాధ్యంగా మారింది.

ఓపెనర్ ఉతప్ప 19, స్టోక్స్ 30, శాంసన్ 36 పరుగులు చేయగా, స్మిత్, 19, రియాన్ పరాగ్ 20, అర్చర్ 16 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ మూడు వికెట్లు పడగొట్టగా, విజయ్ శంకర్, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో వార్నర్ సేన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోగా, ఏడు పరాజయాలతో ఉన్న రాజస్థాన్ ద్వారాలు దాదాపు మూసుకుపోయినట్టే.