తల్లిని కొడుతున్నాడని తండ్రిని చంపేపిన అమ్మాయి!

22-10-2020 Thu 22:09
  • భోపాల్ లో ఘటన
  • తాగొచ్చి భార్యను చితకబాదిన వ్యక్తి
  • భరించలేకపోయిన కుమార్తె
 Teenage girl killed her father in Bhopal
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఓ అమ్మాయి తీవ్ర ఆవేశంతో తండ్రిని అంతమొందించింది. నిత్యం తాగి రావడమే కాకుండా, తల్లిని దూషిస్తూ, ఆమెను విచక్షణ రహితంగా కొడుతుండడంతో తట్టుకోని ఆ అమ్మాయి చేతికందిన కర్ర తీసుకుని తండ్రి అని కూడా చూడకుండా కొట్టింది. ఆ గాయాల తీవ్రతకు అతగాడు అక్కడికక్కడే మరణించాడు. ఆపై ఆ అమ్మాయి 100 నెంబర్ కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించింది.

కొడుకు మేస్త్రీ పని ద్వారా సంపాదిస్తుంటే 45 ఏళ్ల ఈ వ్యక్తి పనీపాటా లేకుండా తిరుగుతూ కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేస్తుండేవాడు. ఈ నేపథ్యంలో కొడుకు పెళ్లి చేయాలని ఇంటి సభ్యులందరూ మాట్లాడుకుంటుండగా, మరోసారి తాగొచ్చి గొడవకు దిగాడు. భార్యను దారుణంగా కొట్టసాగాడు.

దాంతో 16 ఏళ్ల అతని కుమార్తె వెంటనే పక్కనే ఉన్న కర్ర తీసుకుని బలంగా కొట్టింది. తలపై బలమైన దెబ్బలు తగలడంతో అతను కుప్పకూలిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆ బాలికను బాలనేరస్తుల సదనానికి తరలించారు.