Rahul Gandhi: ఉచిత వ్యాక్సిన్ హామీ పెద్ద బూటకం: రాహుల్ గాంధీ

  • బీహార్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఉచిత వ్యాక్సిన్ హామీ
  • మండిపడుతున్న ఇతర పార్టీలు
  • ఇంకా రాని వ్యాక్సిన్ ను ఎలా ఇస్తారన్న రాహుల్ గాంధీ
Rahul Gandhi condemns BJP free vaccine assurance in Bihar

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో రాజకీయ వేడి మళ్లీ రాజుకుంటోంది. ఇప్పుడందరి దృష్టి బీహార్ రాజకీయాలపై పడింది. బీహార్ లో ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీ ఇవ్వగా, ఇతర పార్టీలు మండిపడుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ వస్తే అందరికీ ఉచితంగా ఇస్తామని బీహార్ బీజేపీ ప్రకటించింది. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.

ఉచిత వ్యాక్సిన్ హామీ పెద్ద బూటకం అని విమర్శించారు. ఎన్నికలు జరగనున్నది ఎప్పుడు? వ్యాక్సిన్ వచ్చేది ఎప్పుడు? వీళ్లు ఇచ్చేది ఎప్పుడు? అంటూ ప్రశ్నించారు. ఇంకా రాని వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తామని ఎలా చెబుతారు? అంటూ ప్రశ్నించారు. బీహార్ లో ఉచితంగా ఇస్తే దేశమంతా ఉచితంగా ఎవరు ఇస్తారు అంటూ కాంగ్రెస్ వర్గాలు నిలదీశాయి.

కాగా, బీహార్ లో బీజేపీ ఉచిత వ్యాక్సిన్ హామీ నేపథ్యంలో తమిళనాడు సీఎం పళనిస్వామి కూడా ముందుగా ప్రకటన చేశారు. వ్యాక్సిన్ వస్తే ఫ్రీగా ఇచ్చేస్తామని వెల్లడించారు. భారత్ లోనే కాదు, అమెరికాలో సైతం వ్యాక్సిన్ రాజకీయాలు ఊపందుకున్నాయి. అందరికంటే ముందు అమెరికన్లకే వ్యాక్సిన్ అంటూ అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో హామీలు ఇస్తున్నారు. అయితే మార్కెట్లోకి రాని వ్యాక్సిన్ ను అమెరికన్లకు ఎలా ఇస్తారని ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్ ప్రశ్నిస్తున్నారు.

More Telugu News