ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టినందుకే మా కుటుంబంపై ప్రభుత్వం కక్ష కట్టింది: గల్లా జయదేవ్

22-10-2020 Thu 19:47
  • ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనకడుగు వేయం
  • అమరావతిని మార్చడం ఎవరి వల్ల కాదు
  • అమరావతిని చంపాలని జగన్ కుట్రలు చేశారు
Jagan govt targeted my family says Galla Jayadev

ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టినందుకు, తమ కుటుంబంపై వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టిందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మండిపడ్డారు. ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు. అమరావతిని మార్చడం ఎవరి వల్ల కాదని చెప్పారు. అమరావతిని ఆదర్శ రాజధానిగా తీర్చిదిద్దాలని చంద్రబాబు తపన పడ్డారని... అన్ని ప్రాంతాలను పరిశీలించిన తర్వాతే ఆయన అమరావతిని ఎంపిక చేశారని తెలిపారు. అయితే అమరావతిని చంపాలని జగన్ కుట్రలు చేశారని విమర్శించారు.

కాగా, సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజున అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఢిల్లీని మించిన రాజధానిగా అమరావతి తయారవుతుందని ఆ సందర్భంగా మోదీ అన్నారు. అయితే, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్టు వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర రాజధాని అంశంలో కేంద్రం కలగజేసుకోదని బీజేపీ నేతలు అంటున్నారు. రాజధానిగా అమరావతే కొనసాగాలని ఆ ప్రాంత రైతులు, మహిళలు ఉద్యమం చేస్తున్నారు.