రాజశేఖర్ విషయంలో అసత్య ప్రచారాలు నమ్మొద్దు: జీవిత

22-10-2020 Thu 19:46
  • హీరో రాజశేఖర్ కు కరోనా పాజిటివ్
  • హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ లో చికిత్స
  • కుమార్తె చేసిన ట్వీట్ తో అందరిలో ఆందోళన
  • స్పష్టత నిచ్చిన జీవిత
Jeevitha clarifies her husband hero Rajasekhar health condition

ఈ ఉదయం నుంచి హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజశేఖర్ ఆరోగ్యంపై ఆయన కుమార్తె శివాత్మిక అస్పష్టమైన రీతిలో చేసిన ట్వీట్ అందరిలో ఆందోళన కలిగించింది. అయితే రాజశేఖర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి వర్గాలు స్పందించి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పడంతో అందరూ కుదుటపడ్డారు. తాజాగా రాజశేఖర్ అర్ధాంగి జీవిత స్పందించారు.

ఎవరూ అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. రాజశేఖర్ ఆరోగ్యంపై ఊహాగానాలు ప్రచారం చేయవద్దని, ఆయన ఆరోగ్యం ఇప్పుడు స్థిరంగా ఉందని స్పష్టం చేశారు. క్రమంగా కోలుకుంటున్నారని, రాజశేఖర్ త్వరగా ఆరోగ్యవంతులవ్వాలని దేవుడ్ని ప్రార్థించాలని కోరారు. తమ విషయంలో సానుకూల దృక్పథం చూపాలని అన్నారు.

ఇటీవలే కరోనా బారినపడిన రాజశేఖర్ హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నప్పటికీ వెంటిలేటర్ అవసరం రాలేదని ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ రత్నకిశోర్ వెల్లడించారు.