దివికేగిన తారలను మళ్లీ భువికి రప్పించబోతున్నాం: బాలకృష్ణ

22-10-2020 Thu 18:31
  • ఈ నెల 24న విడుదల కానున్న 'నర్తనశాల'
  • 17 నిమిషాల నిడివిగల సన్నివేశాల విడుదల
  • వసూలయ్యే మొత్తంలో కొంత భాగం ఛారిటీస్ కి ఉపయోగించాలనుకుంటున్న బాలయ్య
We are bringing back Soundarya and Srihari to earth says Balakrishna

నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో గతంలో ప్రారంభించి, ఆగిపోయిన 'నర్తనశాల' చిత్రానికి చెందిన దాదాపు 17 నిమిషాల నిడివి గల సన్నివేశాలను ప్రేక్షకుల కోసం విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. విజయదశమి సందర్భంగా ఈనెల 24న ఈ సన్నివేశాలను శ్రేయాస్ ఈటీ ద్వారా ఎన్బీకే థియేటర్ లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం వసూలు చేసే మొత్తంలో కొంత భాగాన్ని ఛారిటీస్ కి ఉపయోగించాలని బాలయ్య భావిస్తున్నారు.

ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, సౌందర్య, శ్రీహరి వంటి దివికేగిన తారలను మళ్లీ భువికి రప్పించబోతున్నామని చెప్పారు. ఈ సినిమాను చిత్రీకరించే సమయంలో ప్రతి ఆర్టిస్ట్ దగ్గర నుంచి కేవలం 10 రోజులు మాత్రమే డేట్స్ తీసుకున్నామని, కానీ ఐదు రోజుల్లోనే షూటింగ్ చేసేశానని తెలిపారు. కళాకారులకు గౌరవాన్ని ఇవ్వడం, షూటింగ్ సమయంలో అందరూ ఇన్వాల్వ్ అయ్యేలా చూసుకోవడం వంటివన్నీ నాన్నగారి దగ్గరే నేర్చుకున్నానని చెప్పారు.