'బిగ్ బాస్'కి నాగార్జున స్థానంలో స్టార్ హీరోయిన్?

22-10-2020 Thu 16:02
  • ఆకట్టుకుంటున్న 'బిగ్ బాస్ 4' రియాలిటీ షో 
  • మనాలిలో షూటింగ్ చేస్తున్న నాగార్జున
  • నెల రోజుల పాటు బిగ్ బాస్ కి దూరం
  • గ్యాప్ కాలంలో హోస్టుగా కోడలు సమంత  
Star heroine hosts Big Boss

రియాలిటీ షోలలో బిగ్ బాస్ షోకి ఓ ప్రత్యేకత వుంది. పలువురు సెలబ్రిటీలు అందులో పాల్గొంటుండడంతో పాటు ప్రతి సీజన్ కీ ఒక్కో టాప్ స్టార్ హోస్టుగా వ్యవహరిస్తూ షోని రక్తికట్టిస్తూ వస్తున్నారు. అందుకే, దీనికి మంచి టీఆర్ఫీ రేటింగ్ కూడా లభిస్తోంది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ నాలుగో సీజన్ నడుస్తోంది. అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ సీజన్ షో నుంచి ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లు ప్రసారమయ్యాయి.

అయితే, ఇప్పుడు ఒక చిక్కొచ్చిపడింది. హోస్టు నాగార్జున కొన్నాళ్ల పాటు ఈ షోకి అందుబాటులో ఉండడం లేదు. ఆయన హీరోగా రూపొందుతున్న 'వైల్డ్ డాగ్' చిత్రం షూటింగ్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో జరుగుతోంది. ఇటీవలే నాగార్జున కూడా మనాలి వెళ్లి షూట్ లో జాయిన్ అయ్యారు. సుమారు నెల రోజుల పాటు ఈ షెడ్యూలును అక్కడ ప్లాన్ చేశారు. నాగార్జున పాల్గొనే ముఖ్య సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తారు కాబట్టి ఈ నెల రోజులూ ఆయన అక్కడ ఉండాల్సివస్తోంది.  

దీంతో బిగ్ బాస్ షోకి ఈ నెల రోజుల పాటు ఆయన అందుబాటులో వుండరు కాబట్టి, మరి ఈ గ్యాప్ లో ఎవరు హోస్టుగా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో ఇప్పటికే ఇద్దరు ముగ్గురు తారల పేర్లు వినపడినప్పటికీ, తాజా సమాచారాన్ని బట్టి ప్రముఖ నటి, నాగార్జున కోడలు సమంత ఈ గ్యాప్ లో హోస్టుగా వ్యవహరిస్తుందట. నాగార్జున సలహా మీదే ఆమె హోస్టు చేయడానికి ఓకే చెప్పిందని అంటున్నారు.