నాయిని అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసిన కేటీఆర్

22-10-2020 Thu 15:35
  • గత అర్ధరాత్రి కన్నుమూసిన నాయిని నర్సింహారెడ్డి
  • మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
  • మినిస్టర్స్ క్వార్టర్స్ నుంచి అంతిమయాత్ర
Minister KTR attends Nayini Narsimha Reddy funerals

కార్మికనేతగా, ఉద్యమ యోధుడిగా ఖ్యాతిపొందిన మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి (80) మృతితో టీఆర్ఎస్ వర్గాల్లో విషాదం నెలకొంది. నాయినితో ఎంతో అనుబంధం ఉన్నవారు ఆయన కన్నుమూసిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ తొలి హోంమంత్రిగా విశేష సేవలు అందించిన నాయిని ఇక లేరన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కుటుంబంలోనూ తీవ్ర విచారం నెలకొంది.

ఈ క్రమంలో, మంత్రి కేటీఆర్ తమ ప్రియతమ నేత అంత్యక్రియలకు హాజరై నివాళులు అర్పించారు. మినిస్టర్స్ క్వార్టర్స్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కాగా, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ పాడె మోయడం కనిపించింది. నాయిని అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో జరగనున్నాయి.

నాయిని నర్సింహారెడ్డి తీవ్ర అస్వస్థతతో గత అర్ధరాత్రి మృతి చెందారు. ఇటీవలే కరోనా బారినపడి కోలుకున్న ఆయన, ఆ తర్వాత న్యూమోనియాకు గురయ్యారు. కొవిడ్ కారణంగా ఏర్పడిన న్యూమోనియా కావడం, పైగా ఆయనది పెద్ద వయసు కావడం... కోలుకోలేని పరిస్థితులకు దారితీశాయి.