వాహనదారులపై విధించిన భారీ జరిమానాలను రద్దు చేయాలి: అచ్చెన్నాయుడు

22-10-2020 Thu 14:53
  • వాహనదారులపై భారీ జరినామాలతో సరికొత్త విధానం
  • వాహనదారులపై భారం వేశారన్న అచ్చెన్న
  • రవాణా రంగాన్ని ఆదుకోవాలని వ్యాఖ్యలు
AP TDP Chief Atchannaidu responds to state government new motor vehicle policy

ఏపీ ప్రభుత్వం వాహనదారులపై భారీ జరిమానాలతో సరికొత్త విధానం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఎడమచేత్తో ఇచ్చి, కుడిచేత్తో అంతకు రెట్టింపు గుంజుకోవడమే జగన్ సంక్షేమ విధానం అని విమర్శించారు. మోటారు వాహన చట్టంలో సవరణలు తీసుకొచ్చి వాహనదారులపై భారం వేశారని ఆరోపించారు.

రవాణా రంగాన్ని జగన్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. ఈ 16 నెలల్లో కొత్తగా రోడ్డు వేయలేదు, ఉన్నవాటికి మరమ్మతులు చేయలేదని విమర్శించారు. వాహనదారులపై విధించిన భారీ జరిమానాలు వెంటనే రద్దు చేయాలని, సంక్షోభంలో ఉన్న రవాణా రంగాన్ని ఆదుకోవాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.