L Ramana: మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి: ఎల్ రమణ

  • వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేయలేదు
  • ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాణనష్టం
  • ఒక్క హామీని కూడా ప్రభుత్వం నిలబెట్టుకోలేదు
L Ramana fires on TRS govt

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ సర్కిల్ గగన్ పహాడ్ అప్ప చెరువు తెగి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ తరపున రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు.

ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ, నగరంలోని అన్ని చెరువులకు మరమ్మతులు చేస్తామని, నాలాలను విస్తరిస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టలేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అనేక మంది ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు. వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేయలేదని విమర్శించారు.

మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని చెప్పారు. రూ. 30 వేల కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన టీఆర్ఎస్... ఆ హామీని నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు.

More Telugu News