నిర్మాణ పనులతో కళకళలాడిన అమరావతి ఇవాళ నిస్తేజంగా ఉండడం బాధ కలిగిస్తోంది: చంద్రబాబు

22-10-2020 Thu 14:37
  • అమరావతి శంకుస్థాపన జరిగి నేటికి ఐదేళ్లన్న చంద్రబాబు
  • రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడం తుగ్లక్ చర్య అని విమర్శలు
  • అమరావతిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యం అంటూ పిలుపు
TDP National President Chandrababu comments on Amaravati

అమరావతి అంశంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పందించారు. విభజన నష్టాన్ని అధిగమించి 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన సంపద సృష్టి కేంద్రంగా, యువత ఉద్యోగావకాశాల కార్యస్థానంగా ప్రజారాజధాని అమరావతి శంకుస్థాపన జరిగి నేటికి 5 సంవత్సరాలు అయిందని వెల్లడించారు. మూడున్నర సంవత్సరాల పాటు నిరాటంకంగా సాగిన రాజధాని నిర్మాణ పనులను ఏడాదిన్నరగా ఆపేశారని విచారం వ్యక్తం చేశారు.

వేలమంది కూలీలు, భారీ యంత్ర సామగ్రి, వాహనాల రాకపోకలతో కోలాహలంగా, నిర్మాణ పనులతో కళకళలాడిన అమరావతిని స్తబ్దుగా, నిస్తేజంగా చూస్తుంటే బాధేస్తోందని వ్యాఖ్యానించారు. పోటీపడి అభివృద్ధి చేస్తారని ఆశించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నీరుగార్చడం ప్రజాద్రోహం అని చంద్రబాబు మండిపడ్డారు.

"నాడు శంకుస్థాపనకు హాజరైన ప్రధాని, దేశ విదేశాల ప్రముఖుల సందేశాల స్ఫూర్తిని నేడు కాలరాశారు. అవాస్తవ ఆరోపణలు, అభూత కల్పనలతో అమరావతిపై దుష్ప్రచారం సాగిస్తున్నారు. వ్యక్తిపైనో, పార్టీపైనో కక్షతో... చట్టవిరుద్ధంగా రాష్ట్ర రాజధాని నిర్మాణ బృహత్తర యజ్ఞాన్ని భగ్నం చేయడం తుగ్లక్ చర్య" అని చంద్రబాబు విమర్శించారు.

"భావితరాల ప్రజల అవసరాలకు అనుగుణంగా, భారతదేశానికి గర్వకారణంగా నిలిచేలా రూపకల్పన చేయబడి, 13 వేల గ్రామాలు, 3 వేల వార్డుల నుంచి తెచ్చిన పవ్రిత మట్టిని, పుణ్యజలాలతో అభిషేకించి శక్తిసంపన్నం చేసిన మన రాష్ట్ర రాజధానిని కాపాడుకోవడం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పౌరుడి కర్తవ్యం" అని చంద్రబాబు ఉద్బోధించారు.