ఉద్ధండరాయునిపాలెంకు చేరుకున్న అమరావతి రైతులు, మహిళల మహాపాదయాత్ర

22-10-2020 Thu 13:30
  • అమరావతికి మోదీ శంకుస్థాపన చేసి నేటికి ఐదేళ్లు
  • 'అమరావతి చూపు మోదీ వైపు' పేరుతో వినూత్న నిరసనలు
  • ఈ రాత్రి 'అమరావతి వెలుగు' పేరుతో కాగడాల ప్రదర్శన
Amaravati farmers conducting Maha Padayatra

ఏపీ రాజధాని అమరావతికి ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి నేటికి ఐదేళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాజధాని మహిళలు, రైతులు ఉద్ధండరాయునిపాలెంకు మహాపాదయాత్రను నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితం మందడం, రాయపూడి రైతులు, మహిళల పాదయాత్ర ఉద్ధండరాయునిపాలెంకు చేరుకుంది. మరోవైపు 'అమరావతి చూపు మోదీ వైపు' పేరుతో వినూత్న నిరసనలను నిర్వహిస్తున్నారు. ఈ రాత్రికి దీక్షా శిబిరాల వద్ద 'అమరావతి వెలుగు' పేరుతో కాగడాల ప్రదర్శన నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, 310 రోజులుగా ఉద్యమం జరుగుతున్నా ప్రభుత్వంలో చలనమే లేదని మండిపడ్డారు. అమరావతిని చంపేయాలనే ఉద్దేశంతో అభివృద్ది పనులన్నింటినీ ఆపేశారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ స్పందించేంత వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానికే దిక్కులేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా తమ పోరాటం ఆగదని చెప్పారు.