'నారప్ప' కోసం గడ్డంతో రెడీ అవుతున్న వెంకీ!

22-10-2020 Thu 12:34
  • తమిళ సినిమా 'అసురన్'కి రీమేక్ గా 'నారప్ప'
  • లాక్ డౌన్ కి ముందు అవుట్ డోర్ షూటింగ్
  • నవంబర్ 5 నుంచి తిరిగి షూటింగ్
  • 5 రోజుల పాటు గడ్డం గెటప్పులో వెంకీ షూట్  
Venkatesh to start Narappa shoot

సీనియర్ హీరో వెంకటేశ్ నటిస్తున్న తాజా చిత్రం 'నారప్ప'. తమిళంలో వచ్చిన 'అసురన్' చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రం షూటింగ్ అవుట్ డోర్ లో చాలా భాగం జరిగింది. అనంతరం లాక్ డౌన్ తో ఆరు నెలలు బ్రేక్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ షూటింగుకి ఏర్పాట్లు జరుగుతున్నాయి,

ఈ క్రమంలో నవంబర్ 5 నుంచి షూటింగ్ చేయడానికి వెంకటేశ్ సిద్ధం అవుతున్నారు. అయితే, ఆయన ఇప్పుడు ఐదు రోజుల పాటే షూటింగులో పాల్గొంటారని తెలుస్తోంది. ప్రస్తుతం గడ్డం పెంచివున్న వెంకీ ఆ గెటప్పుకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణలో ఐదు రోజుల పాటు పాల్గొంటారట. అనంతరం తిరిగి డిసెంబర్ నుంచి గడ్డం లేని సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంటారని తెలుస్తోంది.

ఇందులో వెంకటేశ్ కి జోడీగా ప్రియమణి నటిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకీ రైతు పాత్రలో కనిపిస్తారు. ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కలైపులి ఎస్ థానుతో కలసి సురేశ్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.