వీళ్లు మామూలు దొంగలు కాదు.. బస్టాప్‌ను ఎత్తుకెళ్లారు!

22-10-2020 Thu 10:00
  • మహారాష్ట్రలోని పూణెలో ఘటన
  • నిందితులను పట్టిస్తే బహుమతి ఇస్తామన్న ఎన్సీపీ నేత
  • ఇనుప సామాన్లు కొనేవారికి అమ్మేసుకుని ఉంటారంటున్న నెటిజన్లు
Entire bus stop stolen in Pune Rs 5000 reward announced for anyone who finds it

సాధారణంగా ఎవరైనా డబ్బు, నగలో, కార్లో, బైకులో ఎత్తుకెళ్తారు. ఇటీవలి కాలంలో బస్సుల దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. అయితే, ఈ దొంగలు మాత్రం కొంచెం వెరైటీ. ఏకంగా బస్టాప్‌నే ఎత్తుకెళ్లారు. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. మహారాష్ట్రలోని పూణెలో జరిగిందీ ఘటన. స్థానికంగా ఉండే ఓ బస్టాప్ అకస్మాత్తుగా మాయం కావడంతో విస్తుపోయిన ఓ వ్యక్తి ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

నగరంలోని దేవకి ప్యాలెస్ ఎదుట పూణె నగర పాలక సంస్థ ఓ బస్టాప్ ఏర్పాటు చేసింది. ఇది కాస్తా చోరీ అయిన విషయం తెలుసుకున్న స్థానిక నేత, ఎన్సీపీకి చెందిన మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ ఆ బస్టాప్ ఫొటోను షేర్ చేస్తూ నిందితుల వివరాలు చెప్పిన వారికి రూ. 5 వేల బహుమతి ఇస్తామని ప్రకటించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పగటి పూట మాత్రం ఈ దొంగతనం జరగలేదని, ఎవరో దానిని రాత్రిపూట ముక్కలు చేసి పాత ఇనుప సామాన్లు కొనేవారికి అమ్మేసుకుని ఉంటారని అంటున్నారు. గతంలో ఇక్కడ బస్టాప్ ఉన్న మాట వాస్తవమేనని, ఇప్పుడది కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు.