నితీశ్ కుమార్ పాదాలను తాకి నమస్కరించిన చిరాగ్!

22-10-2020 Thu 09:36
  • ఇటీవల కన్నుమూసిన రామ్ విలాస్ పాశ్వాన్
  • నివాళులు అర్పించేందుకు వచ్చిన నితీశ్ కుమార్
  • గౌరవ సూచకంగా పాదాలకు నమస్కారం
Chirag Paswan Touched Nitish Kumars Feet

బీహార్ సీఎం నితీశ్ కుమార్ పాదాలను తాకి చిరాగ్ పాశ్వాన్ నమస్కరించిన ఆసక్తికర ఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన కాసేపటికే జనతాదళ్ యునైటెడ్ తరఫున బరిలోకి దిగేవారిపై పోటీ చేసే లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థుల వివరాలను చిరాగ్ ప్రకటించడం గమనార్హం. ఇటీవల కన్నుమూసిన రామ్ విలాస్ పాశ్వాన్ కు నివాళులు అర్పించేందుకు నితీశ్ కుమార్, స్వయంగా చిరాగ్ ఇంటికి వచ్చారు. ఆ సమయంలో గౌరవ సూచకంగా చిరాగ్ ఆయన పాదాలను తాకారు.

నితీశ్ కుమార్ అలా వెళ్లగానే, తన పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన చిరాగ్, జేడీయూ నేత దినేశ్ సింగ్ కుమార్తె కోమల్ సింగ్ ను తన పార్టీ తరఫున అభ్యర్థినిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె గైఘాట్ నియోజకవర్గం నుంచి పోటీ పడనుంది. ఈ స్థానంలో జేడీయూ నుంచి తన కుమార్తెను బరిలోకి దించాలని తొలుత భావించిన దినేశ్ సింగ్, ఆ సీటును మహేశ్వర్ యాదవ్ కు పార్టీ కేటాయించడంతోనే చిరాగ్ ను ఆశ్రయించి, ఎల్జేపీ తరఫున కోమల్ సింగ్ ను దింపినట్టు తెలుస్తోంది.