ఎన్డీయేకు మరో పార్టీ గుడ్‌బై.. తమ మద్దతు మమతకేనన్న జీజేఎం!

22-10-2020 Thu 09:21
  • గత నెలలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన శిరోమణి అకాలీదళ్
  • బీజేపీ తమను మోసం చేసిందన్న గరుంగ్
  • మూడేళ్ల తర్వాత బహిరంగంగా కనిపించిన జీజేఎం చీఫ్
GJM walks out of NDA

బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే నుంచి బయటకు వచ్చేస్తున్న పార్టీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత నెలలో శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే కూటమి నుంచి బయటకు రాగా తాజాగా, గోరఖ్ జనముక్తి మోర్చా (జీజేఎం) ఎన్డీయేకు టాటా చెప్పేసింది. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్న బీజేపీకి ఇది ఎదురుదెబ్బేనని చెబుతున్నారు. ఇంతవరకు అజ్ఞాతంలో వున్న జీజేఎం చీఫ్ బిమల్ గురుంగ్ నిన్న బయటకువచ్చి, తాము ఎన్డీయేను వీడుతున్నట్టు ప్రకటించారు. ముఖ్యమంత్రి మమత బెనర్జీ సారథ్యంలోని టీఎంసీతో కలిసి ముందుకు సాగుతామని ప్రకటించారు.

డార్జిలింగ్ పర్వతశ్రేణి అభివృద్ధిని కేంద్రం విస్మరించిందన్న బిమల్.. 11 గోరఖ్ సముదాయాలను బలహీన వర్గాల జాబితాలో చేరుస్తామన్న హామీని తుంగలో తొక్కిందని ఆరోపించారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా, టీఎంసీకి అనుకూలంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.

2017 నుంచి పరారీలో ఉన్న గురుంగ్ తిరిగి డార్జిలింగ్‌లో కాలుమోపాలని ప్రయత్నిస్తున్నారు. కాగా, శిరోమణి అకాలీదళ్‌లా జీజేఎంకు పార్లమెంటులో ఎంపీలు లేరు. హత్య, యూఏపీఏ కేసులు ఎదుర్కొంటూ మూడేళ్లుగా పరారీలో ఉన్న గురుంగ్ నిన్న మీడియా ముందుకు వచ్చారు. 12 ఏళ్లగా కూటమిలో ఉంటున్న తాము ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నట్టు చెప్పారు. బీజేపీ తమను మోసం చేసిందని ఆరోపించారు.