'తుగ్లక్ దర్బార్' నుంచి తప్పుకోవడంపై వివరణ ఇచ్చిన అదితి!

21-10-2020 Wed 21:40
  • విజయ్ సేతుపతి హీరోగా 'తుగ్లక్ దర్బార్'
  • అదితి స్థానంలో వచ్చిన రాశీఖన్నా  
  • డేట్స్ రీ షెడ్యూల్ కారణంగా తప్పుకున్నానన్న నటి
  • నిర్మాతతో మాట్లాడి చేశానన్న అదితీ రావు  
Aditi Rao Gives clarity why she stepped out of Tuglak Darbar

ఒక సినిమాలో ముందు అనుకున్న ఆర్టిస్టులు మళ్లీ మారిపోవడం.. వారి స్థానంలో మరొకళ్లు రావడం మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. అయితే, బయట ప్రచారం మాత్రం మరోలా జరుగుతుంటుంది. తాజాగా కథానాయిక అదితీరావు హైదరి విషయంలో కూడా అలాగే జరిగింది.

తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా, అదితి కథానాయికగా 'తుగ్లక్ దర్బార్' పేరిట ఓ సినిమా మొదలైంది. లాక్ డౌన్ కి ముందు కొంత షూటింగ్ కూడా జరిగింది. అయితే, తాజాగా అదితి స్థానంలోకి రాశిఖన్నా వచ్చింది. దీనిపై బయట అప్పుడే రకరకాల ప్రచారం మొదలైంది. అదితిని ఈ సినిమా నుంచి తీసేశారంటూ ప్రచారం జరుగుతోంది. దాంతో తాజాగా అదితి దీనిపై వివరణ ఇచ్చింది.

"కరోనా కారణంగా మిగతా రంగాల లాగానే సినిమా రంగం కూడా ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు స్తంభించింది. ఇప్పుడు షూటింగులు మళ్లీ మెల్లగా దశల వారీగా మొదలవడంతో,  షెడ్యూల్స్ అన్నీ రీ షెడ్యూల్ చేయాల్సి వస్తోంది. ఒక ఆర్టిస్టుగా ఎవర్నీ వెయిటింగులో పెట్టడం బాధ్యత అనిపించుకోదు. అందుకే, చిత్ర నిర్మాతతో మాట్లాడి, ఈ ప్రాజక్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. నా స్థానంలో వచ్చిన రాశీఖన్నాకు బెస్ట్ విషెస్ చెబుతున్నాను" అంటూ అదితి వివరంగా పోస్ట్ పెట్టి, ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టింది. దీనికి రాశి కూడా థ్యాంక్స్ చెబుతూ వెంటనే రిప్లై ఇచ్చింది.