బాలయ్య 'నర్తనశాల' టికెట్ వెల రూ.50

21-10-2020 Wed 19:51
  • బాలయ్య స్వీయదర్శకత్వంలో నర్తనశాల
  • శ్రేయాస్ ఈటీలో ప్రదర్శన
  • అక్టోబరు 24న విడుదల
Balakrishna Nartanasala movie ticket price fixed

నందమూరి బాలకృష్ణకు పౌరాణికాలన్నా, జానపద చిత్రాలన్నా ఎంతో మక్కువ. తన నట ప్రస్థానంలో ఆయా జానర్లతో పలు చిత్రాలు చేసి మెప్పించిన ఘనత బాలకృష్ణ సొంతం. ఆ క్రమంలోనే ఆయన 'నర్తనశాల' చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో తెరకెక్కించే ప్రయత్నం చేసినా, అనుకోని కారణాల వల్ల ఆ చిత్ర నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. అయితే తన ప్రయత్నాన్ని ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు ఓటీటీ వేదికగా తీసుకురావాలని బాలయ్య సంకల్పించారు.

'నర్తనశాల' చిత్రంలో తాను తెరకెక్కించిన దాంట్లో 17 నిమిషాల మేర సన్నివేశాలను శ్రేయాస్ ఈటీ ఓటీటీ వేదికగా ఈ నెల 24న విడుదల చేస్తున్నారు. అందుకోసం టికెట్ ధరను రూ.50లుగా నిర్ణయించారు. ఈ చిత్రం ద్వారా వచ్చిన నిధులను సామాజిక సేవకు ఉపయోగిస్తానని బాలయ్య ప్రకటించారు.

కాగా, టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత ఈ చిత్రంపై స్పందించారు. "ఈ సినిమాకు మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మన బంగారు బాలయ్య ద్వారా అవసరంలో ఉన్న వారికి చేరుతుంది. నర్తనశాల తప్పక చూడండి" అంటూ తనవంతు ప్రచారం చేశారు.

ఈ చిత్రంలో బాలకృష్ణ అర్జునుడిగా నటించగా, సౌందర్య ద్రౌపది పాత్ర పోషించింది. ధర్మరాజుగా శరత్ బాబు, భీముడి పాత్రలో శ్రీహరి నటించారు. బాలయ్యపై అభిమానంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం లక్షలు వెచ్చించి టికెట్ కొని తమవంతుగా సామాజిక సేవలో పాలుపంచుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.