ఐపీఎల్ లో నేడు కోల్ కతా వర్సెస్ బెంగళూరు... టాస్ గెలిచిన మోర్గాన్

21-10-2020 Wed 19:19
  • అబుదాబిలో మ్యాచ్
  • బ్యాటింగ్ ఎంచుకున్న కోల్ కతా
  • ఇరుజట్లకు కీలకంగా మారిన మ్యాచ్ ఫలితం
Kolkata Knight Riders faces Royal Challengers Bengaluru

ఐపీఎల్ లో నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. ఈ పోరులో టాస్ గెలిచిన కోల్ కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోల్ కతా జట్టులో రెండు మార్పులు చేసినట్టు కెప్టెన్ మోర్గాన్ వెల్లడించాడు. గాయపడిన ఆండ్రీ రస్సెల్ ఈ మ్యాచ్ లో ఆడడంలేదని తెలిపాడు. రస్సెల్, మావి స్థానంలో బాంటన్, ప్రసిద్ధ్ కృష్ణ ఆడతారని వివరించాడు.

గత సీజన్లకు భిన్నంగా స్ఫూర్తిదాయక ఆటతీరుతో దూసుకుపోతున్న బెంగళూరు జట్టు మరో విజయంపై కన్నేసింది. అటు బ్యాట్స్ మన్లు, ఇటు బౌలర్లు రాణిస్తుండడం బెంగళూరుకు కలిసొస్తోంది. ముఖ్యంగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉండడం మిగతా ఆటగాళ్లకు ప్రేరణ కలిగిస్తోంది.  ఇక, బెంగళూరు జట్టులో ఒక మార్పు చేశారు. షాబాజ్ స్థానంలో పేసర్ సిరాజ్ కు స్థానం కల్పించారు.

కోల్ కతా జట్టుకు ఇటీవల ఇయాన్ మోర్గాన్ రూపంలో కొత్త కెప్టెన్ వచ్చాడు. అతడు జట్టును మరింతగా విజయాల బాటలో నడిపిస్తాడని జట్టు మేనేజ్ మెంట్ భావిస్తోంది. ప్లే ఆఫ్ దశ సమీపిస్తున్న నేపథ్యంలో ఇరుజట్లకు ఈ మ్యాచ్ ఫలితం ఎంతో ముఖ్యమైనదే.