కేన్సర్ పై విజయం సాధించిన సంజయ్ దత్!

21-10-2020 Wed 18:34
  • ఊపిరితిత్తుల కేన్సర్ కు గురైన సంజయ్ 
  • ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స
  • నేడు పిల్లల బర్త్ డే సందర్భంగా వెల్లడి
  • ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పిన సంజయ్  
Sanjaudath wins over cancer

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కేన్సర్ వ్యాధి నుంచి కోలుకున్నారు. తాను కేన్సర్ ను జయించినట్టుగా ఆయన ఈ రోజు వెల్లడించారు. కొన్నాళ్ల క్రితం ఆయన ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ వార్తతో దత్ ఫ్యామిలీ అభిమానులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఎంతగానో కలత చెందారు.

ఈ నేపథ్యంలో తాను కేన్సర్ పై విజయం సాధించానంటూ ఈ రోజు తన పిల్లల జన్మదినం సందర్భంగా సోషల్ మీడియాలో సంజయ్ పేర్కొన్నాడు. దీనిపై వివరంగా ఒక పోస్ట్ కూడా పెట్టాడు.

"గత కొన్ని వారాలుగా నాకు, నా కుటుంబ సభ్యులకు కఠినమైన కాలమని చెప్పాలి. బలమైన వాళ్లకే భగవంతుడు కఠినమైన పోరాటాలను అప్పజెబుతాడని పెద్దలు అన్నట్టుగానే, నాకూ జరిగింది. ఈ రోజు మా పిల్లల బర్త్ డే సందర్భంగా.. కేన్సర్ పై పోరాటంలో నేను విజయం సాధించానని చెప్పడానికి ఆనందంగా వుంది. నేను పూర్తి ఆరోగ్యవంతుడినై తిరిగి రావడం అనే కానుకను పిల్లలకు ఇస్తున్నందుకు మరింత సంతోషంగా వుంది.  
 
మీ అందరి ఆశీస్సులు, మద్దతు లేకపోతే ఇది నాకు సాధ్యమయ్యేది కాదు. ఈ కష్ట కాలంలో నాకు అండగా నిలిచి, శక్తిపొందడానికి బాసటగా నిలిచిన నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు ఎప్పటికీ కృతజ్ఞుడనై వుంటాను. ఈ సందర్భంగా నాకు అత్యుత్తమ వైద్య సేవలు అందించిన డాక్టర్ సేవంతి, ఆమె బృందానికి, కోకిలా బెన్ ఆసుపత్రి నర్సులకు, సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను' అంటూ సంజయ్ తన పోస్టులో పేర్కొన్నాడు.