Ajeya Kallam: ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నా పేరు వాడుకుంటున్నారట... ఆ సంగతేంటో చూడండి: డీజీపీకి ఫిర్యాదు చేసిన అజేయ కల్లం

Ajeya Kallam complains to DGP Gautam Sawang over whatsapp allegations
  • తనకు వాట్సాప్ లో సందేశాలు వస్తున్నాయన్న అజేయ కల్లం
  • లైన్ మన్ జాబ్స్ పేరిట డబ్బు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు
  • కఠినచర్యలు తీసుకోవాలన్న కల్లం
ఏపీ సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం తన పేరిట కొందరు మోసాలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని, ఈ వ్యవహారంలో నిగ్గు తేల్చాలని కోరుతూ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఫిర్యాదు చేశారు. పలు వాట్సాప్ గ్రూపుల నుంచి తనకు లెక్కకుమిక్కిలిగా సందేశాలు వస్తున్నాయని, మంగళగిరి ప్రాంతంలో ఓ గ్యాంగు తన పేరు చెప్పుకుంటూ జూనియర్ లైన్ మన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తోందన్నది ఆ సందేశాల సారాంశం అని అజేయ కల్లం తన ఫిర్యాదులో వివరించారు.

ఆ గ్యాంగు తమ కార్యకలాపాలపై నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించేందుకు తన పేరు వాడుకుంటున్నట్టు ఆరోపణలు వచ్చిన దరిమిలా, ఇందులో నిజమెంతో తనకు తెలియడంలేదని అజేయ కల్లం పేర్కొన్నారు.

"ఒకవేళ ఈ ఆరోపణలే నిజమని తేలితే నిరుద్యోగులను మోసం చేస్తున్న వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.  ఒకవేళ నాకు వచ్చిన సందేశాలు తప్పని తేలితే, ఆ ఫేక్ మెసేజ్ లు ఎవరు పంపారో, ఎక్కడినుంచి పుట్టుకొస్తున్నాయో గుర్తించి న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించి దర్యాప్తు ప్రారంభిస్తారని కోరుతున్నాను" అంటూ అజేయ కల్లం రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
Ajeya Kallam
Whatsapp Messages
AP DGP
Gautam Sawang
Job Fraud
Mangalagiri

More Telugu News